సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌

 సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

-- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌  





 కామారెడ్డి ప్రతినిధి,మార్చ్ 15 ( ఇందూర్ నేత్రం ):

 సైబర్ నేరాలు జరగకుండా ప్రతి  ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనిజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన డిజిటల్ ఫైనాన్స్ పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ ద్వారా డబ్బులను వస్తువులను  కొనుగోలు చేసిన వ్యక్తులు, షాపుల యజమానులకు సులభంగా పంపించే వీలుందని సూచించారు. వీధి వ్యాపారుల పేటీఎమ్  క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే సులభంగా డబ్బులు  వినియోగదారులు వారికి పంపించుకొనే వెసులుబాటు కలిగిందని పేర్కొన్నారు. సెల్ఫోన్ కు వచ్చే ఓటీపీ నెంబర్ అపరిచిత వ్యక్తులకు చెప్పవద్దని తెలిపారు.



 ప్రతి వ్యక్తి  వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలని తెలిపారు. కంప్యూటర్లు తన పేర్లపై  పాస్వర్డ్లు పెట్టవద్దని సూచించారు. డిజిటల్ లావాదేవీలపై బ్యాంకు అధికారులు అవగాహన కల్పించాలని  కోరారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల హక్కుల కమిటీ అధ్యక్షురాలు బొమ్మెర సువర్ణ చంద్రశేఖర్ మాట్లాడారు. రేషన్ షాపుల్లో ప్రతి నెల 1 నుంచి 20వ తేదీ వరకు వినియోగదారులకు రేషన్ సరుకులు అందించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో వినియోగదారుల క్లబ్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు. జిల్లా ఇంచార్జ్ డీఎస్ఓ రాజశేఖర్ మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో మోసాలు జరగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో వేలిముద్రలు తీసుకుని సరుకులను వినియోగదారులకు అందజేస్తారని తెలిపారు. కరోనా సమయంలో సెల్ఫోన్ ఓటీపీ ద్వారా సరుకులను వినియోగదారులకు అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం సభ్యులు, రేషన్ డీలర్లు , అధికారులు పాల్గొన్నారు.