గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత

గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత

  గోదావరిఖని,మార్చ్ 9 ( ఇందూర్ నేత్రం ):





  గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు గని ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు యాజమాన్యంతో చేసిన చర్చలు విఫలం కావడంతో సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మిక సంఘాలు బాధిత కుటుంబానికి  కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ డిమాండ్ చేయగా సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్ అంగీకరించకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులతో పాటు కార్మిక సంఘాలు సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మార్చురీ వద్ద  శ్రీకాంత్ మృతదేహాన్ని బొగ్గు గని  వద్దకు తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులకు కుటుంబ సభ్యులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. గతంలో ప్రమాదం జరిగినప్పుడు 40 లక్షలు చెల్లించారాని ఇప్పుడు అంతకన్న ఎక్కువ మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేస్తే కేవలం 30 వేలు చెల్లిస్తామని అనడంతో కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురికావాల్సి వచ్చిందని టిబిజికెఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పేర్కొన్నారు.